
దుబ్బాక, వెలుగు: బీజేపీలో చేరితే బెదిరించడమేంటని మంత్రి హరీశ్‌రావుని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్‌రావు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరే కుటుంబాలకు బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు, రేషన్ కార్డు రాదని బీఆర్ఎస్ నాయకులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి హరీశ్‌రావు ఎక్కడ మీటింగ్ పెట్టినా బీజేపోడు వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతారని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు జరిగి మూడేళ్లైనా రాష్ట్రంలో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టారో నిరూపించాలని మంత్రికి సవాల్ విసిరారు. అనంతరం ఎనగుర్తి గ్రామానికి చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో అంబటి బాలేశ్‌గౌడ్, శుభాష్‌రెడ్డి, వీభిషన్ రెడ్డి, మంద అనిల్ రెడ్డి, అరిగె కృష్ణ, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, గాజుల భాస్కర్, సుంకు ప్రవీణ్, మాదవనేని భాను పాల్గొన్నారు.